
సారిక నుంచి ఫోన్ వచ్చింది
"ట్రిల్!" పిచుక అరుపులా ఒక చిన్న శబ్దం నా పిక్సెల్ ఫోన్ నుంచి వచ్చింది.
వెంటనే ఫోన్ వైపు తిరిగి చూశాను. WhatsApp నోటిఫికేషన్. ‘సారిక: Busy aa?’
వెంటనే రిప్లై ఇచ్చాను —"పర్లేదు, చెప్పు ."
బ్లూ టిక్స్ రాలేదు...
సారిక...
నేను మొదటగా జాయిన్ అయిన కంపెనీలో నా సహోద్యోగి. కానీ అంత పెద్దగా పరిచయం లేదు. నిజం చెప్పాలంటే తను మా టీం మెట్ కాదు. ప్రాజెక్ట్‌లో నేను జాయిన్ అయిన దాదాపు ఆరు నెలల తర్వాతే తనతో సరైన పరిచయం జరిగింది.
తను నా లాగే డెవలపర్ కాదు — సెక్యూరిటీ టూల్స్ మీద పనిచేస్తుంది.
నేను రాసిన కోడ్‌ను వాళ్ల టూల్‌లో స్కాన్ చేసి, దాంట్లో ఏమైనా సెక్యూరిటీ బగ్స్ ఉన్నాయా అని చెక్ చేయడం ఆమె పని. నా కోడ్‌ని ప్రొడక్షన్‌కి పంపే ముందు ఓసారి స్కాన్ చేయమని ఆమెకి రిక్వెస్ట్ పెట్టాను. స్కాన్ అయ్యాక రిప్లై వచ్చింది తన నుండి — "రెండు ఇష్యూస్ ఉన్నాయ్."
నేను చూసి చెప్పాను —"ఇవి నేను రాసిన కోడ్ వల్ల కాదు. అవి false positives. ఆపరేటింగ్ సిస్టం అలానే డిజైన్ చేయబడి ఉంది. కోడ్ మార్చడం నా చేతుల్లో లేదు."
అలా మొదలైన చిన్న చర్చ, మొత్తం ఒక నెల రోజులు ‘డిబేట్’లా మారింది. ఈ ప్రక్రియలో స్నేహం అని చెప్పలేను కానీ పరిచయం పెరిగింది అంటాను.
నాకు తెలిసినంత వరకు సారిక ఓ విచిత్రమైన అమ్మాయి. చూడ్డానికి చాలా శాంతంగా, నెమ్మదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. మా ఆఫీసులో ఫ్రెషరుగా జాయిన్ అయ్యింది. ఆ సమయంలోనే వెర్నా కారు లో వచ్చేది.దాన్నిబట్టి చూస్తే బాగా డబ్బున్న కుటుంబం నుంచి ఉంటుంది అని ఎవరైనా ఇట్టే చెప్పగలరు. డ్రెస్సింగ్ చాలా పద్ధతిగా — నోసటిపై విభూతితో — చాలా సంప్రదాయంగా ఉంటుంది.
చెవిలో ఎప్పుడూ హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఉండేది.ఎప్పుడు పాటలు వింటూ ఉంటుంది అనుకునే వాళ్ళం.మా పరిచయంలో భాగంగా తెలిసింది ఏంటిదంటే, తను పాడ్కాస్ట్ వింటుంది అని.మాకు పాడ్కాస్ట్స్ గురించి అంతగా తెలీదు అప్పుడు.ఆఫీస్‌లో ఉన్నప్పుడు రోజులో కనీసం ఒక ఆరు సార్లయినా గ్రీన్ టీ తాగేది.ఇంటికెళ్ళాక కూడా తాగుతుండచ్చేమో — నేను ఎప్పుడు అడగలేదు. మా ప్రాజెక్టులో పనిచేసే సమయంలో ఒక రోజు కూడా లీవ్ తీసుకోలేదు.100% యుటిలైజేషన్ రిపోర్ట్ ఉండేది తనకి.
చెప్పాను కదా, తాను ఒక విచిత్రమైన మనిషి అని...మెల్లిగా మాట్లాడుతుంది కానీ ఎదుటివారికి అది కామెంట్‌లాగా అనిపిస్తుంది.ఎదుట ఎవరున్నారు, ఎలాంటివారున్నారు అని లెక్కేసుకోనేది కాదు...ఎవరినైనా విమర్శించేది.
ఎంతలా అంటే — "సారిక ముందు పుట్టి విమర్శ తర్వాత పుట్టిందా?" అనిపిస్తుంది.
ఏ విషయాన్నైనా ఆమె విమర్శించగలదు.
ఒకసారి ఏమి జరిగింది అంటే — ఆఫీసు టీ బ్రేక్‌లో ఒకసారి మా కొలీగ్ ఒకడు, "ఈ వారం బాగా పని ఉంది, ఓవర్ టైం చేయాల్సి వస్తుంది" అని సణిగాడు.
బ్లాక్ హోల్ గురించి వింటున్న ఆమె...
నెమ్మదిగా హెడ్‌ఫోన్స్ తీసి, అతని వైపు చూసి, "పని ఎక్కువ ఉంది, ఓవర్ టైం చేయాలి అంటే, నీ ప్లానింగ్ సరిగా లేదు అనమాట. లేదంటే పని ఎలా చేయాలి అనీ నీకు ఇంకా పూర్తిగా తెలియదు," అని ఎలాంటి భావం లేకుండా చెప్పి, మళ్లీ హెడ్‌ఫోన్స్ పెట్టుకుంది. మేమిద్దరం ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం.
ఇంకోసారి ఏమి అయింది అంటే — మా టీం లీడ్, "ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి, వేడిని భరించలేకున్నా," అని అన్నారు.ఆమె గ్రీన్ టీ సిప్ చేస్తూ, "చెట్లు నాటకుండా పొద్దస్తమానం ఎయిర్ కండీషనర్లు వేసుకొని, ఎండల గురించి మాట్లాడుతున్నారు," అనేసింది.
అప్పుడు అనిపించింది — ఆమె ఏ విషయాన్నైనా విమర్శించగలదు అని.
తన వ్యక్తిగత విషయాలు ఎవరికీ తెలియదు.
నేను సిటీ మరియు కంపెనీ మారిపోయాక రెండు మూడుసార్లు ఫోన్ చేసింది నాకు — అది కూడా వర్క్ సంబంధమైన విషయాల గురించి మాట్లాడటానికి.
ఒక అరగంట తర్వాత ఆమె నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
లిఫ్ట్ చేయగానే...
"నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది," అంది.
నాకు సరిగానే వినపడింది — ఆమె నిజంగానే ఆత్మహత్య గురించే మాట్లాడింది.
ఎందుకనో నాకు ఏమీ అనిపించలేదు.ఫోన్ చెవి దగ్గర ఉండగానే, కిటికీలోంచి అప్పుడే వెలిగించిన వీధిలైటు వైపు దృష్టి మళ్లింది.
ఇంకొకరు ఎవరైనా ఇలా చెబితే — నేను షాక్ అవతానేమో. "అలా మాట్లాడకు!", "చెప్పొద్దు! తప్పు!" అన్నట్టు రియాక్ట్ అవతానేమో.
కానీ సారిక అలా చెప్పినపుడు నాలో ఎటువంటి సడన్ రియాక్షన్ లేదు.తను ఇంకా ఏదో చెప్తుంది — నేను వినడం లేదు.నేను ఎందుకని రియాక్ట్ అవలేదు? అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను... బహుశా emotional latency అని సైకాలజీలో దీనిని అంటారేమో.
ఒక నిమిషం తర్వాత తేరుకొని,
"Hey, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావ్? ఏమైందీ? ఎందుకొస్తున్నాయి నీకు ఇలాంటి ఆలోచనలు? మెంటల్ లాగా మాట్లాడకు," అంటూ లేని రాని కోపాన్ని అరువు తెచ్చుకొని అరవలేదు కానీ కొంచెం గట్టిగ చెప్పాను.
తను మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది...
"నాకు ఎందుకు జీవించాలో, ఎవరికోసం జీవించాలో తెలీడం లేదు."
ఈ అమ్మాయి అందరూ అనుకుంటున్నట్టు సైకోనేమో అని అనుకున్నాను ఒక్కక్షణం...
ఎవరి కోసమో ఎవరు బతకరు... నీకోసం నువ్వే బతకాలి. ఎవరికీ ఎవరు శాశ్వతం కాదు, నీకు నువ్వు మాత్రమే శాశ్వతం. బ్రతికున్నపుడైన, చనిపోయాక నీ ఆత్మకైనా...
అంటూ, నాలో ఉన్న ఒక తెలివితక్కువ, ఎవరికీ ఉపయోగపడని ఫిలాసఫర్ — పనికిమాలిన ఫిలాసఫీ చెప్తే — నేను మెల్లిగా చెప్పాను.
ఆ క్షణం నా స్వరం కూడా కొంచెం మారింది.మామూలుగా నేను మాట్లాడే దానికి భిన్నంగా, రెండు మైక్‌లు ముందు పెట్టుకుని, గదిలో లైట్లు మసకబార్చి, కాఫీ కప్పు పక్కన పెట్టుకుని, ప్రపంచంలోని లోతైన రహస్యాలను ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్‌లో చెప్పబోతున్నాం అన్నట్టుగా...చాలా నెమ్మదిగా, ఒక మంద్ర స్వరం లోకి జారింది నా మాట. జీవిత సాగరాన్ని అలవోకగా ఈదేసి వస్తున్నాం అన్న భ్రమలో చెప్పే అలాంటి కబుర్లు అన్నీ విని విని, నేను కూడా అలాగే తయారయ్యాననిపించింది నాకు.
"మీ లోపలి ప్రశాంతతను మీరు గుర్తించండి... బయట ప్రపంచం మిమ్మల్ని ప్రభావితం చేయనివ్వద్దు..."ఇలాంటి డయలాగులు వింటూ, వాటిలోని ప్రతీ పదాన్ని తూకం వేసుకుని... "అబ్బా, ఏమి చెప్పాడురా?" అని రాత్రిపూట నిద్రపట్టకుండా ఆలోచించే వాడిని నేను.ఇప్పుడు వాటినే నేను తిరిగి, పాపం సారికకు వల్లె వేస్తున్నాను. నా ఈ మాటలు వింటే ఆమెకి నవ్వొస్తుందో, లేక మరోటో... అదంతా నాకు తెలియని ఒక విచిత్రమైన ఉద్వేగం. దాన్ని బయటకి ఎలా పంపించాలో తెలియక, ఇలా పడికట్టిన డైలాగులు అరువు తెచ్చుకున్నానేమో.
తెలియని ఒంటరితనం నన్ను వేధిస్తుంది...దేని మీద నాకు ఆశ కానీ, ఆసక్తి కానీ లేదు. ఇలా ఉండాలి, ఇలా చేయాలనీ కొంచెం కూడా అనిపించడం లేదు.నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు.అమ్మకి బుక్స్, సినిమాలు మాత్రమే ప్రపంచం.మేము లగ్జరీగా ఉండటమే, దానికి కావాల్సిన డబ్బు సంపాదించడం మాత్రమే తన పని అన్నట్టు నాన్న.24 గంటలు ఇంట్లో పని వాళ్ళు ఉంటారు.అదేంటో, మేము చెప్పిన పని మాత్రమే చేయడం — దానికి మించి ఒక మాట మాట్లాడిన నేరం అన్నట్లు ఉంటారు వాళ్ళు."నాతో ఎవరు మాట్లాడారు..." అంటూ చెప్పడం ఆపేసింది.ఒక క్షణం నిశ్శబ్దం.ఆ తర్వాత ఫోన్ అవతలి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్న స్పష్టమైన శబ్దం వినపడింది.
ఆమె పూర్తిగా కుప్పకూలిపోయింది అనుకుంటా.
నేను చిన్నపుడు చదివిన కథల్లో కథానాయకుడు తాళ్ళపాకలో ఉంటూ, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా, ఆకలికి తట్టుకోలేక కుళాయి నీళ్లు తాగడం కష్టాలుగా అనిపించేవి. సారిక చెప్తున్న మాటలు నాకు ఎక్కలేదు.ఆమెకి ఇటువంటి కష్టాలు ఏమి లేవు.
"ముందు అలా ఆలోచించడం మానేసేయ్... బిజీగా ఉండటానికి ప్రయత్నించు. కొత్త టెక్నిలజీస్ నేర్చుకో. చదవటం, రాయడం లాంటి హాబీ ఏర్పరుచుకో. ట్రిప్స్ కి వెళ్లు. నాకు ఫేస్బుక్‌లో ఒక ట్రావెలర్ గ్రూప్ వాళ్ళు తెలుసు, నీకు పరిచయం చేస్తాను. కొన్నిరోజులు వాళ్లతోపాటు వెళ్లిరా..." అంటుండగానే —
"నీకంటే నేను ఇలాంటివి చాల బాగా చెప్పగలను. నా ప్లేస్‌లో ఉంటే నీకు నాభాధ తెలుస్తుంది. ఇవన్నీ చేయడం కన్నా చనిపోవడం చాల ఈజీ అనిపిస్తుంది నాకు," అని చెప్పి ఫోన్ కట్టేసింది.
నాకు తిరిగి ఫోన్ చేయాలనిపించలేదు, కానీ మళ్లీ చేయకపోతే బాగుందేమో అని ఫోన్ చేశాను.
తాను లిఫ్ట్ చేయలేదు.
"అలాంటి పిచ్చిపనులు చేయకు," అంటూ ఒక మెసేజ్ చేసి గమ్మునుండిపోయాను.
సారిక విషయంలో నేను ఎందుకని భావరహితంగా ఉండిపోయాను? తను అందరిలాగా లేదనా? ప్రతిదీ విమర్శిస్తుంటుంది అనా? తల్లిదండ్రులే పట్టించుకోనపుడు, మనకెందుకులే అనా? మనం అడవుల్లో ఒంటరిగా జీవించడంలేదుకదా — స్నేహితులని చేసుకోలేకపోవడం లో నాకేంటి సంబంధం? "నీకంటే నేను ఇలాంటివి చాల బాగా చెప్పగలను" అనే అహంకారం వల్లనా?
ఇందులో నా తప్పులేదుకదా? అని నన్ను నేను సమాధానపరుచుకోవడానికి ప్రశ్నించుకున్నాను.
ఒకవేళ ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే?
అలాంటపుడు నాకే ఎందుకు ఫోన్ చేయాలి? — ఎప్పుడో ఒకసారి తను నాతో ఇలా అన్నది:
"ఎవరు ఏమి చెప్తున్నా వింటుంటావ్... నీకు అంత పేషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఏమైనా హాబీనా?"అప్పుడు నవ్వేశాను, కానీ ఇప్పుడు ఆ మాటలు లీలగా గుర్తొస్తున్నాయి.
అతివిశ్రాంతంగా మాట్లాడే నన్ను అప్పుడే గమనించి ఉండొచ్చు.అందుకే… నాకే ఫోన్ చేసింది.
రేపు ఇన్వెస్టిగేషన్‌లో ‘లాస్ట్ డయల్డ్ నంబర్’గా నా నంబర్ కనబడితే? రక్షకభట జాతి నన్ను ఊరికే ఉండనిస్తుందా?
"మెంటల్ది..." అని తిట్టుకుంటూ,
మళ్లీ ఫోన్ చేశాను.
ఈ సారి — ఆమె లిఫ్ట్ చేసేంతవరకు చేస్తూనే ఉంటాను.