
బల్లి పిల్ల వేదాంతం
బాత్రూం ట్యాప్ నుండి టప్... టప్... అంటూ నీటి చుక్కలు పడ్తున్నాయి. ఆ శబ్దం ఒక మెలోడీ రాగంలాగా వస్తుంది.
“కాన్సర్ట్ ఏమైనా జరుగుతుందా? అయిన మనకు టికెట్ గీకెట్ అవసరమా? మనల్ని ఎవడ్రా ఆపేది, కాసేపు విందాం, పద,” అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది — బల్లి పిల్ల.
పుట్టిన తర్వాత అది మొదటిసారి బాత్రూం లోకి వచ్చింది. ఇంతవరకు ఇంటి బయట పైపు వెనుక గోడకు ఉన్న నెర్రలో దాక్కుని ఉండేది. కానీ ఈ రోజు… దానికి ఒక్క ఆలోచన వచ్చింది — “ఇప్పుడు నేను పెద్దదాన్ని అవుతున్నాను... ప్రపంచాన్ని చూడాలి! పరిసరాల గురించి తెలుసుకోవాలి.”
అది గోడమీద మెల్లిగా పాకుతూ లోపలి ప్రవేశించింది. తెల్లటి టైల్స్, వాటి మీద ఉన్న బొమ్మలు చూస్తూ దాని కళ్ళు పెద్దవయ్యాయి — “ఏంటి ఇవి! మేఘాల్లా మెరుస్తున్నాయి,” మనసులో అనుకుంటూ ఒక టైల్ మీదకి ఎగబాకింది. టైల్ చల్లదనం ఒంటికి తగలగానే పరవశించిపోయింది.
ఎదురుగా గోడ మీద అద్దం కనిపించింది. దానిలో ప్రతిబింబం — మొదటిసారి అద్దం చూసిన సందర్భం అది. తన ప్రతిబింబం అని తెలియదు.
బల్లి పిల్ల కాసేపు స్థబ్ధుగా చూసింది — మెల్లగా దగ్గరికి కదిలింది. అద్దంలోని రూపం కూడా కదిలింది. ఇద్దరూ ఒకరినొకరు పరిశీలిస్తున్నట్టుగా. దానికి ఆశ్చర్యం, ఆనందం, ఇంకా చిన్న భయం కలిసిపోయాయి.
“ఇంత అందంగా ఉండే జీవి నేనెప్పుడూ చూడలేదు! ఇంత తెల్లటి గోడల మధ్య మెరుస్తోంది… బహుశా ఇది ఈ బాత్రూం రాణేమో.”
ఒక క్షణం అది తనను మరచిపోయింది. తన గుండె కొట్టుకోవడమే మాత్రమే వినిపిస్తోంది.
దాని కళ్ళలో ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబం — రెండూ ఒకేలాగ మెరుస్తున్నాయి.
మెల్లగా దగ్గరికి వెళ్లి తాకబోయింది.
అదే క్షణంలో ఏదో సందేహం — “దగ్గరికి వెళ్తే ఏమైనా జరుగుతుందేమో… ముందు ఎక్సప్లోర్ చేద్దాం, మళ్లీ వస్తానో రానో ఇక్కడికి,” అని అద్దం నుంచి దృష్టి తిప్పి చుట్టుపక్కల పరిశీలిస్తోంది.
ఇంతలో బయట నుండి ఒక గాలి — ఆ గాలి ఫ్రెష్‌నర్ బాటిల్‌ను తాకింది. సువాసన ఒక్కసారిగా గదంతా వ్యాపించింది.
బల్లి ఒక్క క్షణం ఊపిరి బిగపట్టింది — “అయ్యో! ఇంత ఘాటు వాసనా! ఇక్కడ ఎక్కువసేపు ఉంటే చావొచ్చేలా ఉంది. ఇక వెళ్దాం,” అనుకుంటూ వెనక్కి తిరుగుతుంది…
అప్పుడే — తలుపు దగ్గర నుండి ఓ శబ్దం…
తలుపు దబ్బున తెరుచుకుంది. వెలుగు లోపలికి చొచ్చుకువచ్చింది.
“మేఘాలే తాకింది…” అని పాట పాడుకుంటూ లోపలికి వచ్చాడతను.
ఇప్పుడు నేను ఇక్కడనుంచి కదిలితే ఏమవుతుంది? ఎందుకొచ్చిన గొడవ, కాసేపు ఏమి జరగనట్టు ఉందాం అనుకుంటూ అక్కడే ఉండిపోయింది బల్లి పిల్ల.
తెరుచుకున్న తలుపు మూసుకుంది. బల్లి పిల్ల గుండెలో ఉత్కంఠ మరింత పెరిగింది. వెళ్ళిపోయుంటే బాగుండేదేమో అనుకుంది ఒక్క క్షణానికి.
పాట ఇంకా కొనసాగుతూనే ఉంది.
తనకి ఆ ప్రదేశం పుట్టినప్పటి నుండి తెలుసు. చుట్టూ ఏమి జరుగుతుందో గమనించకుండా, యథాలాపంగా బట్టలు విప్పి స్నానం చేద్దామని వేడి నీళ్ల షవర్ ట్యాప్ తిప్పాడు అతను.
మనిషి తన చిరపరిచయమైన ప్రదేశాల్లో ఏమి ఆలోచించకుండా ప్రవర్తిస్తాడు అనేదానికి ఇదే ఉదాహరణ.
షాంపూ నెత్తిన వేసి రుద్దుకుంటుంటూ యథాలాపంగా అతని చూపు గోడ మీదకి వెళ్ళింది.
ఒళ్ళు జలదరించింది, ఎదో చూడరానిది చూసినట్టు. అతని నరాలు చిక్కబడ్డాయి. గట్టిగా గాలి లోపలికి పీల్చి “ఉష్ ఉష్” అనడం మొదలెట్టాడు.
బల్లి పిల్ల నెత్తి కొట్టుకుంటూ — “నన్నేనా ఏమంటున్నాడు? ఒక్క మాట అర్థమైతే ఒట్టు! పొమ్మంటున్నాడా? పోతాలేరా నాయనా! నాక్కూడా ఇక్కడ ఊపిరి ఆడటం లేదు... కొంచెం తేరుకోనివ్వు నన్ను. నువ్వు చెప్పేది నాకెట్టా అర్థం కాదో, నీకు కూడా నేను చెప్పేది అర్థం కాదు. నువ్వు ముందు వచ్చిన పని కానివ్వు,” అనుకుంది.
“దినెక్క, ఇట్ట కాదు, ఉండు! నిన్ను ఏమి చేస్తానో చూడు,” అనుకుంటూ మగ్ నిండా వేడి నీళ్లు పట్టి దూరం నుండే దాని వైపుకు విసిరాడు. దాని మీద పడలేదు. మళ్ళీ నీళ్లు పట్టి ఈసారి కొంచెం దగ్గరగా వెళ్లి పోసాడు.
“ఏం చేసావురా సామీ!” అని తిట్టుకుంది బల్లి పిల్ల. ఒళ్ళంతా కాలి, పట్టు జారీ కిందకి పడింది. ఆ హడావిడిలో బైటకి వెళ్ళాల్సింది పోయి అతడి వైపుకి తిరిగింది.
“అయ్యో బాబోయ్! ఇది నా మీదకే వస్తుంది,” అనుకుంటూ వెనక్కి తిరిగి వేగంగా వెళ్లి అక్కడున్న స్టూల్ ఎక్కాడు.
బల్లి పిల్ల తేరుకొని పక్కనే ఉన్న గోడ ఎక్కింది. మెలోడీకి మురిసిపోతూ వచ్చిన దారి మరిచిపోయింది.
అతను ఈసారి జెట్ స్ప్రేతో బల్లి మీద నీళ్లు కుమ్మరించాడు. ఆ ధాటికి గోడ మీదుగా జారి బాత్రూం డోర్ దగ్గరికి వెళ్లి పడింది.
“ఇక్కడే ఉంటే నన్ను చంపేదాకా వదిలేట్టు లేడు! ఎలాగైనా బైటపడాలి,” అనుకుంటూ ఒకసారి పైకి చూసింది. డోర్ నుండి లైట్ రావడం గమనించింది. ఒక్క ఉదుటున పైకి ఎగబాకి, లైట్ రావడం కోసం ఉంచిన రంధ్రం గుండా బైటికి వచ్చింది. ఆ తొందరలో తోక తెగిపోయింది. “బతికించావ్ దేవుడా! ఒక వంద దోమలు తిని నీ మొక్కు తీరుస్తా,” అనుకుంది బల్లి.
“వెళ్ళిపోయింది దొంగముండా! నన్నే బెదిరిస్తదా? స్నానం చేసేప్పుడు చంపకూడదు అనుకున్న కాబట్టి బతికిపోయావ్, లేకపోతేనా...” (నిజానికి అక్కడ దాన్ని చంపడానికి మరే ఆయుధం లేదు.) మేక పోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడతను.
షవర్ నుండి కింద పడుతున్న నీళ్ల శబ్దానికి, నెత్తికి షాంపూ ఉన్న విషయం గుర్తొచ్చి దానికింద నిలబడ్డాడు.
అతను ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నాడు — అది నిజంగా వెళ్లిందా? లేక ఇక్కడే దాక్కుందా? త్వరగా ఇక్కడనుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ గబా గబా సబ్బు రుద్దుకుంటున్నాడు, మధ్య మధ్యలో చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడొచ్చి మీద పడుతుందేమోని.
స్నానం అవగానే, ఒళ్ళు సరిగా తుడుచుకోకుండానే, “ఇది ఒకసారి దారి చూసింది అంటే మళ్లీ మళ్లీ వస్తది. నెక్స్ట్ టైం నుండి స్నానం చేసే ముందే చూసుకొని రావాలి,” అనుకుంటూ బాత్రూం డోర్ తెరిచి ఒక్క దూకు దూకాడు.
ప్రమాదం ఇంకా లేదు అనుకుని తన ప్రదేశానికి వెళ్తున్నపుడు, దారిలో బల్లి పిల్ల తాత కనిపించాడు.
“ఎమ్మా! ఏమైంది? ఏదో ప్రమాదం నుండి బయటపడినట్టున్నావ్,” లేని తోకను చూస్తూ అన్నాడు.
జరిగిన విషయం మొత్తం చెప్పింది. బల్లి తాత సమాధానమిస్తూ ఇలా అన్నాడు —
“మీ పిల్ల నాబట్టలందరూ ఇంతే. అన్నిటికీ ఆత్రం ఎక్కువ. సొంతంగా తెలుసుకోవాలా, కనుక్కోవాలా అని పానాల మీదకి తెచ్చుకుంటారు.
నువ్వు పోయిన సాట మనోళ్లు ఒక్కడైనా కనపన్యాడా ? అసలు ఒక్కటైనా మన గుర్తు ఉంద్యా? కొన్ని సలాలు మనకు మంచివి కావుమ్మ , సూన్నికి అనువుగానే ఉంటాయి. దగ్గిరకి పోతేనే తెలుస్సది — పెమాదం అని.
మనసులు సువాసన కోసం యేవో తెచ్చి పెట్టుకుంటారు , అయి మనకి గాలాడకుండా సేస్తాది. లోపల సల్లగానే ఉంటది, ఉన్నట్టుండి భరించలేని వేడి వస్తాది .
ఏది ఏమైనా మీకందరికీ అనుభవిమైతేనే లే తెలిసేది. ఒక్క మాట చెప్తా ఇను — వయసులో ఉన్నపుడే ప్రయోగాలన్నీ సెయ్యాల, తెలుసుకోవాలా. కానీ సేసేముందు ఒకసారి బాగా ఇసారించుకోవాలా, మాలాంటోళ్లని అడగాలా, సెప్పింది ఇనాల , ఒకటికి నాలుగు తూర్లు అలోసన సేయాలా , తర్వాత ఎవరికీ నష్టం లేదనుకున్నాకా, యెనకడుగు వేయకుండా ముందుకు పోవాలా.”
“అర్థమైంది తాత! వచ్చేముందు చెప్పిరావల్సి ఉన్నది... కానీ తాత, ఒక విషయం చెప్పు — అతనెవరో నాకు తెలీదు, నేనెవరో అతనికి తెలిసుండదు. నేనేమి అతనికి నష్టం వచ్చే పని చేయలేదు. నన్ను చూస్తానే పగొన్ని చూసినట్టు యుద్ధం మొదలెట్టినాడు.”
బల్లి తాత గట్టిగా శబ్దం చేశాడు (నవ్వి) —
“దానికి సానా కారణాలుండాయి, చెప్తా ఇను... ఆ మనిసి చిన్నప్పుడు, మీ ముత్తవ్వ, ఇల్లా ఈధిలో ఉండే ఒకామె పడుకొని ఉంటే, ఆమె నుదురు మీద ఉమ్మింది. దాంతో ఆ యమ్మ నుదురంతా మండి పొక్కులొచ్చినై. ఈది ఈదంతా చర్చలు చేసిరి. అప్పటినుండి అతనికి మనమంటే భయంలే.
దానికితోడు ఈ మనుషులకి, వాళ్ళ అన్నంలో మనం పడితే విషం అని పుకార్లు. ఇంగ మనం ఆళ్ల మీద పడితే అయియేవో శాస్త్రాలుండాయిలే, దురదృష్టం వస్తాదని చెప్తారు,” అని చెప్పి ఆపాడు.
“కానీ మన ఒంట్లో ఎక్కడ విషముంది తాత?”
“మనం ఇసపురుగులు కాదులే. కానీ నిజమేందంటే, మన యర్ధాల్లో పేరాన్న జీవులుంటాయి (సాల్మొనెల్లా). దానివల్ల రోగాలు వస్తాయి ఆళ్లకి.”
“ఇప్పటికి నాకు అర్థం కానిది ఏందంటే, నన్ను చంపేంతవరకు వదల్లేదు అతను, ఎందుకని?”
“దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది ఏందంటే, మన ఈ అందం వీళ్లకి కంటగింపుగా, అసహ్యమేస్తది. రెండోది — మనం సర్రుమంటూ ఇష్టం వచ్చినట్టు పాస్టుగా దొరక్కుండా పోతామా...ఆ పోయే టైం లో కొన్ని సార్లు కిందపడతాం. ఆళ్ళ మీద ఎక్కడ పెడతామో అని వాళ్ళ మెదడు పేమద గంటలు కొడ్తది. అది అతని నిర్ణయం కాదు; అతని శరీరం మెదడుకి ఆటోమేటిక్‌గా సెప్తాది.
అందుకే ఆల్లు మనల్ని ఏంటాడుతానే ఉంటారు — “భయం రెండు వైపులా ఉంది. తేడా ఏందంటే — ఒకటి భయంతో పారిపోతుంది, ఇంకొకటి భయంతో చంపుతుంది,” అంటూ చెప్పడం ఆపేసాడు బల్లి తాత.
అర్థమైంది తాత, ఇంకెప్పుడు ఈ దారికి రాము అంటూ అక్కనుంచి తన స్వస్థలానికి దారి పట్టింది.
how to kill lizards
అంటూ అతను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నాడు.
అక్కడి నుండి బయటికి వచ్చి గోడ మీద కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది బల్లి పిల్ల. లోపల ఇంకా నీరు పడుతున్న శబ్దం వినిపిస్తోంది — టప్... టప్...
ఆ శబ్దం ఇప్పుడు రాగంలా కాకుండా గుండెల్లో కొట్టుకుంటున్న భయంలా అనిపించింది.
“నేను తప్పు చేసానా? అతని ప్రపంచంలో అడుగు పెట్టడం నిషేధమా?”
చల్లటి గాలి తాకింది. ఆ చల్లదనం తోకలేని శరీరంలో కొంచెం జీవం పోసింది.
“ఏమో, బహుశా మనం భయపడేది వాళ్లలా; వాళ్ళు కూడా మనలాగే...” అని అనుకుంది.