
పునర్జన్మ
"వీడేం చేస్తున్నాడు అంతసేపు బాత్రూములో? అన్వర్... రే నాయన అన్వర్!" పిలుస్తుంది తల్లి జెహ్రాబు, ఉతికిన బట్టలని మడతబెడ్తూ.
"మెయ్ చాంద్భి! చూడుపో అట్ల. చానాసేపయింది వాడు లోపలికి వెళ్లి."
"ఆఁ, సరే!" వంటింట్లో నుండి సమాధానం ఇచ్చింది చాంద్భి (ఆ మాటలో కోపం, అలసట, బాధ మూడూ కలిసి ఉన్నాయి).
బాత్రూమ్ తలుపు తడుతూ, "ఏమండి... ఏమండి..." అని గట్టిగా పిలిచింది. లోపలి నుండి ఎటువంటి శబ్దం రావడం లేదు. గుండెలో ఏదో అలజడి, గాభరా మొదలయ్యింది.
కళ్ల నిండా నీళ్లతో వసారాలోని మంచం మీద పడుకుని ఉన్న మామ దగ్గరికి వెళ్లి చెప్పింది, "ఆయన బాత్రూమ్ లోపలనుండి పలకడం లేదు."
ఆ మాట వినగానే ఆయన ముఖం ఒక్క క్షణంలోనే రంగు కోల్పోయింది. వయసు వల్ల వచ్చిన నొప్పిని మరిచి, నడుం పట్టుకుని లేచాడు. కుంటుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. "రేయ్ చిన్నోడా, చిన్నోడా!" అంటూ తలుపు మీద కొట్టాడు. తలుపు గట్టిగా నెట్టాడు—కాని బాత్రూమ్ తలుపు కదలలేదు. ఇంకోసారి శక్తినంతా తెచ్చుకుని తోశాడు. వయస్సు వల్ల చేతుల్లో బలం లేదు; నడుం నొప్పి ముల్లులా గుచ్చింది.
ఆమె ప్రయత్నించింది, తన చేతులతో, భయంతో, ఆశతో—కాని తలుపు కదలలేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు— ఈ పరిస్థితిలో ఏమీ చేయలేమన్న అసహాయత వారి కళ్లలో స్పష్టంగా కనిపించింది.
మామ వీధి వైపు చూసి, వీధిలో అటుగా వెళ్తున్న ఇద్దరు ముగ్గురు యువకుల్ని పిలిచి తలుపు బద్దలుకొట్టమని చెప్పారు. యువకులు ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా తలుపు మీద భుజాలు పెట్టి బలంగా కొట్టారు. కొద్దిసేపటి తర్వాత తలుపు చెక్కలు విరిగి లోపలికి ఒరిగింది. అన్వర్ అర్థనగ్న శరీరంతో బకెట్ మీద అచేతనంగా కూలబడి ఉన్నాడు. అతని భారీ శరీరం... పది వసంతాలుగా ఆ కుటుంబాన్ని కప్పేసిన అతని నిరుపయోగమైన బద్ధకం యొక్క బరువు, ముగ్గురు కలిసి లాగితే గానీ బయటికి రాలేదు.
ముగ్గురు యువకులు చివరకు అతన్ని బయటకి తీసుకొచ్చారు.
ఒక యువకుడు నాడీ పట్టుకొని చూసాడు, అతనికి అర్థం అయ్యింది. చాంద్భి ఆ యువకుడి మొహం చూసింది, అతని ముఖంలో మారుతున్న రంగును గమనించింది. "అంత అయిపొయింది" అన్న చూపు. అది చెప్పబోయేంతలో వీధిలో జనం చుట్టుముట్టారు.
"అంబులెన్సుకి ఫోన్ చేయండి! హాస్పిటల్కి తీసుకెళ్లాలి!" అంటూ గోల గోలగా అరుపులు మొదలయ్యాయి.
చాంద్భికి తన అత్త ఏడుపు అరుపులాగా వినపడుతుంది. ఓ వైపు భయం కలుగుతుంది. తల ఎత్తి సీలింగ్ వైపుకు చూస్తూ వాకిట పక్కకి వాలిపోయింది. శూన్యంలో అంగీకారాన్ని వెతుక్కుంది.
"అంబులెన్స్ వచ్చింది, త్వరగా ఎక్కించండి!" చుట్టూ మళ్లీ అరుపులు. అంబులెన్స్ లో వచ్చిన నర్సు పల్స్, స్టెతస్కో పెట్టి చూసాడు.
"ప్రాణం లేదమ్మా..."
ఒక్కసారిగా జనంలో గందరగోళం. జెహ్రాబు గుండెల్ని బాదుకుంటూ నేల మీద పడి అరుస్తోంది.
"నీకేం తెలుసు? నువ్వు ఏమైనా డాక్టర్ ఆ? ముందు హాస్పిటల్ తీసుకొని పో! ప్రాణం ఉంది," వీధి పెద్ద గట్టిగ అరుస్తున్నాడు. అధికారం మరియు అజ్ఞానం కలగలిసిన వ్యక్తులు, వాస్తవాన్ని అంగీకరించకుండా, తమ అసంబద్ధమైన అధికారాన్ని ప్రదర్శిస్తుంటారు, అన్ని వేళల.
"సార్, పల్స్ లేదు. సార్... ఆడికి తీసుకొని పోతే పోస్టుమార్టం చేస్తారు, నా మాట వినండి," అన్నాడు. మనిషి జీవితం ముగిసిన తర్వాత కూడా, వ్యవస్థ అతని శరీరాన్ని చీల్చి, మరణానికి ఒక అధికారిక, అమానవీయ వివరణ ఇవ్వాలని చూస్తుంది.
"అయన్ని మేము చూసుకుంటాం, నువ్వు పోనీ ముందు," వీధి పెద్ద కొట్టడానికి వచ్చాడు.
"వీళ్లకి చెప్తే అర్థం కాదు, నువ్వు పోనీరా," అంటూ డ్రైవర్ని విసుక్కున్నాడు. డ్రైవర్‌కి ఇదంతా అసహజంగా ఏమీ అనిపించలేదు; ఇలాంటివి చాలాసార్లు చూశాడు. మరణాన్ని నిజం అనుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కదా? అన్వర్ తల్లిదండ్రులతో పాటు ఇంకొంతమంది వీధి జనాలు అంబులెన్స్ తో పాటు వెళ్లారు. ఆ సమయంలో కూడా బురఖా కోసం వెతుకుతుంది జెహ్రాబు.
పది నిమిషాల తర్వాత పక్కింటి రజియా వచ్చి చాంద్బితో చెప్తోంది: "అక్కడ డాక్టర్లు చూసి చెప్పారు, 20 నిమిషాల ముందే ప్రాణం పోయిందట. పోస్టుమార్టం చేయాలి అని లోపలికి తీసుకెళ్లారు. మామ, డాక్టర్ల, పోలీసుల తో, “సార్… నా కొడుకు చచ్చిపోయాడు… ఇంకా చీల్చి చంపొద్దు సార్… దయ చేసి వాడిని ఇచ్చేయండి…” అంటూ కాళ్లు పట్టుకొని బతిమాలుతున్నాడు."
ఒక గంట తర్వాత...
అన్వర్ వచ్చాడు. కాదు, అందరూ కలిసి మోసుకొస్తున్నారు.
అన్వర్ పెళ్లికి ముందు ఏ పని చేసేవాడు కాదు. అలాగని పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. అతని నాన్న ఉన్న 4 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. తినడానికి ఇబ్బంది లేకుండా గడుస్తుండేది. మొదట్లో అన్వర్ బంగారు ఆభరణాలు తయారు చేసే పని చేస్తుండేవాడు. ఎక్కువ సంపాదించాలనే ఆశతో గల్ఫ్ కి పోయినాడు. బంగారు పని కోసం వెళ్తే ఏజెంట్ మోసం చేసి ఒంటెలు కాసే పనికి కుదిర్చాడు. అక్కడ 2 నెలలు కూడా ఉండలేక, వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఎలాగోలా ఇంటికి తిరిగి వచ్చాడు.
గోల్డ్ రేటు ఎక్కువ అవడంతో పని దొరకడం కష్టమైంది ఇక్కడికి వచ్చేశాక. పని మానేశాడు. చివరకి తన నాన్నకి వ్యవసాయంలో కూడా సహాయం చేసేవాడు కాదు.
చేతిలో డబ్బులున్నపుడు లేదా ఎవరైనా తాపించినపుడు మందు కొట్టడం, రోజంతా మేకమార్కు బీడీలు తాగుతూ, టీవీ చూస్తూ ఒక దశాబ్దం గడిపేశాడు.
పెళ్లి చేయండి ఒక దారికి వస్తాడు అంటూ ఎవరో సలహా ఇస్తే, సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
చేతిలో పని లేదు, ఆస్తిపాస్తులు లేవు, పెళ్లి వయసు దాటి కూడా పదేళ్లవుతోంది. పురుషుడి విలువ “అతని సంపాదన” గా కొలిచే సమాజంలో అతని విలువ జీరో. పెళ్లి సంబంధాలు ఎక్కడనుండి వస్తాయి? పాపం, చాంద్భి చిక్కుకుంది. చాంద్భి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అక్క పెంచి పెద్ద చేసింది. అక్కకి పదిహేనేళ్లప్పుడే పెళ్లి చేసారు. ఆరోగ్య కారణాలరీత్యా ఆమెకు పిల్లలు పుట్టలేదు. తనని సొంత కూతురులాగా పెంచి పెద్ద చేసింది.
అక్క, చెల్లిని కూతురు అనుకుంది కానీ, బావ అనుకోలేదు. తన జీవితంలో ఇబ్బందులొస్తాయనుకోలేదు కానీ, చాంద్భి జీవితమైనా బాగుండాలనుకుంది.
తల్లితండ్రులు లేని జీవితం, కఠినమైన పేదరికం, వేరే ఇంటికి వెళ్తే తన జీవితం అయినా మారుతుంది అనుకుని, ఎలాగోలా కష్టపడి పెళ్లి చేసింది చాంద్భి కి.
తనకి తెలీదు, చాంద్భి జీవితం ఇంకా దుర్భరం అవుతుందని. పెళ్లి అయినా కొత్తలో వాళ్ళ మామకు పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అది మొదలు అత్తగారు సాధించడం మొదలుపెట్టింది. "పిల్లొచ్చిన వేళా, గొడ్డొచ్చిన వేళా ఇది రావడం... ఆయనకీ ఆక్సిడెంట్ అయింది. చస్తూ బతికాడు. దీని అడుగే అశుభం,” అని ప్రతి చిన్న కారణానికీ తిడుతూ ఉండేది. అత్త అనే అహంకారం, కోడలి మీద అధికారం చెలాయించడం హక్కుగా భావించేది. ఆక్సిడెంట్ తర్వాత ఉన్న నాలుగు ఎకరాలు అమ్మేయాల్సి వచ్చింది, వైద్యం కోసం. ఆ వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు.
చాంద్భి భుజాల మీద మరో రెండు బరువులు.
అన్వర్ దేహాన్ని మంచం మీద పడుకోబెడుతున్నపుడు...
జెహ్రాబు ఏడుపు ఇపుడు కాస్తా తనకి బాగా అలవాటైన తిట్ల రూపం తీసుకున్నాయి: "నా కొడుకుని చంపేసింది, నా మనుమల్ని అనాధల్ని చేసింది. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేంది లేదు నా కొడుకుని! రాగానే నా మొగుణ్ణి చంపుదాము అనుకుంది, ఇపుడు నా కొడుకుని చంపేసింది!"
చాంద్భీ ఎప్పటిలాగే మౌనంగానే ఉంది. ఆమెకు మౌనం అలవాటు కాదు; అది జీవితం ఆమెకు నేర్పిన ఏకైక రక్షణ.
నిజానికి, కొన్ని రోజుల ముందు ఒక చిన్న గొడవ జరిగింది. పక్కింట్లో పిల్లవాడు ఐస్ క్రీం తింటుంటే, అది చూసి వారి పెద్ద కొడుకు కూడా నోరూర్చుకుంటూ అతని వైపే చూస్తుండటం గమనించింది. కొనివ్వడానికి తన దగ్గర చిల్లిగవ్వ లేదు. అన్వర్‌కి చెప్పినప్పుడు, అతని స్పందన ఎప్పటిలాగే నిర్లక్ష్యమే.
“కాసేపు ఉంటే మరిచిపోతాడు… నువ్వూ అంత పట్టించుకోకు,” అన్నాడు.
అపుడు వచ్చింది తనకి కోపం. "పిల్లల్ని పెంచడం చేతకానపుడు కనకూడదు," చాంద్భీ అంది. అది అన్వర్‌ను కాదు, వారి జీవితం యొక్క అసంబద్ధమైన స్థితిని ఆమె ప్రశ్నించింది. వెంటనే టపీ మని చెంప మీద దెబ్బ. చాంద్భీ ఏమీ చెప్పలేదు. భర్తవైపు జాలిగా చూసి నవ్వి అక్కడనుండి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
అన్వర్ మరుసటి రోజు ఉదయం ఎక్కడికో వెళ్లిపోయాడు. సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు అతని నడకలోనూ, ముఖం మీదనూ ఏదో అలసట కనిపించింది. రాత్రి చాందీబీ అన్నం పెడుతుండగా, అతని అరచేతులు ఆమె కంటపడ్డాయి. సిమెంట్ కలపడం వల్ల పుట్టిన చిన్న రంధ్రాలు, గాట్లు, అక్కడక్కడా ఊడిపోయిన తోలు. ఆమెకు బాధ వేసింది.
అతను ఏమీ కాకపోయినా, ఏదో ప్రయత్నం చేశాడని మాత్రం స్పష్టంగా కనిపించింది.
పడుకునేటప్పుడు చెప్పింది, "నువ్వు బేల్దారి పనికి వెళ్లొద్దు. అక్క వాళ్ళింటి దగ్గర కొత్తగా పెద్ద బట్టల షాప్ పడింది, దాన్లోకి పనికెళ్తాను నేను," అని చెప్పింది. ఆ మాటతో గదిలో ఉన్న మౌనం ఒక్కసారిగా ఆవిరైంది. అన్వర్ కళ్లలో అలసట కంటే కోపం కనపడింది ఒక్కసారిగా...
"మా ఇంటి ఆడోల్లు ఇంట్లో మాత్రమే ఉండాలి, బైటికెళ్లి మా పరువు బజార్న వేయకు. దాని గురించి ఇంకా నాతో మాట్లాడకు," అంటూ అక్కనుంచి వెళ్ళిపోయాడు.
చాంద్భి నిశ్శబ్దంగా నిల్చుంది. ఆమెకు అతని మాటల కన్నా, అతను పడ్డ కష్టం ఎక్కువ బాధ కలిగించింది.
వారమంతా పని చేసి బట్వాడా తీసుకున్నాడు అన్వర్. వచ్చేప్పుడు ఇద్దరు కొడుకులకూ ఐస్‌క్రీం కొని తీసుకొనిచ్చాడు. అవి వాళ్లు తీసుకొని నవ్వుతున్నప్పుడు అతను కూడా చిన్నగా నవ్వాడు. ఆ ఆనంద సంఘటన జరిగిన గంటలోపే, అతను చనిపోయాడు.
పక్కన ఎవరో చెప్తున్నారు, "బంగారు పని చేసేప్పుడు సినిమా హీరోలా టిప్ ఠాప్‌గా తిరిగోటోడు లాస్టుకి బేల్దారి పనికి పోయినాడు," అని అతని మీద జాలి చూపిస్తున్నారు.
కానీ తన గురించి ఎవరు మాట్లాడటం లేదు, ఆలోచించడం లేదు. ఆమె పడిన మానసిక హింస ఇవి ఎవరికీ కనిపించవు. సమాజం మగవాడి ఓటమిని “ట్రాజెడీ” అంటుంది. కానీ ఒక స్త్రీ పడుతున్న బాధ ఆమె దురదృష్టంలా కనపడుతుంది.
అన్వర్‌ను డోలిలో పెట్టి తీసుకెళ్తున్నారు. జెహ్రాబు గుండెల్ని బాదుకుంటూ అరుస్తూ ఏడుస్తుంది. చాంద్భి పక్కన నిలబడి ఉంది; ఆమె కళ్లల్లో నీళ్లు లేవు. నీళ్లు కంటే లోతైన ఒక ఖాళీ మాత్రమే ఉంది.
డోలీలో వెళ్తుంది, అన్వర్ శరీరం మాత్రమే కాదు, చాందీబీ దుఃఖం, నిరాశ.
సందడి తగ్గిన తర్వాత కూడా ఇంటి ముందు జనం నిలబడే ఉన్నారు. జెహ్రాబు ఏడుపు నిశబ్దంగా మారకపోయినా, దానిలో పదును పోయింది. కేవలం ఒక అలవాటుగా, అరిగిపోయిన బాధలా వినిపిస్తోంది. చాంద్బీ వసారాలో గోడకు ఆనుకుని కూర్చొని ఉంది.
ఇప్పుడు ఇంట్లో నుంచి ప్రశాంతత. గందరగోళం, ఆవేశం—అంతా మాయమైంది. మిగిలింది ఒక భయంకరమైన శూన్యం, ఒక పెద్ద ఖాళీ.
సూర్యాస్తమయం అవుతోంది. గడిచిన పది సంవత్సరాలుగా అన్వర్ కూర్చునే మంచం ఖాళీగా ఉంది. చాంద్బీ ఆ మంచం వైపు చూసింది.
ఆ మంచం ఒకప్పుడు తన భర్తకి, ఇప్పుడు తన బాధకు ఒక జ్ఞాపకం.
పక్కనే ఉన్న రజియా వచ్చి, చిన్నపిల్లవాడిని ఆడిస్తూ మెల్లగా అంది: "వాడికి ఏదో దేవుడు ఇలా రాశాడు చాంద్."
చాంద్బీ మొహంలో ఎటువంటి భావం లేదు. "దేవుడు రాయడం కాదు రజియా! తను రాసుకున్నాడు. నాకు, పిల్లలకు ఆస్తిని ఇవ్వలేకపోయాడు కానీ, స్వేచ్ఛను ఇచ్చాడు." ఆమె గొంతులో మౌనం కోపంగా మారింది.
ఆ రాత్రి భోజనాలు లేవు. పిల్లలు ఆకలితో అలిసిపోయి, ఏడుస్తూ పడుకున్నారు.
చాంద్బీ వంటగదిలోకి వెళ్లింది. ఆ రోజు అన్వర్ పనికి వెళ్లి సంపాదించిన బట్వాడా గుర్తొచ్చింది.
బీడీల వాసన, నిరుద్యోగం, అవమానం—వీటి బరువు మోసిన ఆ డబ్బు. చాంద్బీ ఆ నోట్లను తీసి, వాటిని మడత పెట్టి, పాత ఇత్తడి డబ్బాలో పెట్టింది.
ఒక రోజు సంపాదన, ఒక దశాబ్దపు జీవితానికి ముగింపు, మరొక జీవితానికి ప్రారంభం.
జెహ్రాబు వంటింట్లోకి వచ్చింది. ఆమె కళ్ళ నిండా కసి, అలసట, కోపం. "నా కొడుకును చంపేసినావు."
గ్యాస్ స్టవ్ మీద నీళ్ళు పెట్టింది.
చాంద్బీ ఆమె కళ్ళలోకి చూసి మాట్లాడటం ఆమె జీవితంలో ఇదే ప్రథమం. ఆమె కళ్లలో అధీకారం లేదు, భయం లేదు. "బట్టల షాప్ పనికి వెళ్తాను. మా అక్క నాకు దారి చూపిస్తుంది. నా కొడుకులకు నేను బేల్దారి పని చేయకుండా తాను పొందని జీవితం ఇస్తాను," అంది చాంద్బీ.
జీవితం కొంతమంది నుంచి అన్నింటినీ తీసుకుంటుంది. అదే తీసుకునే సమయం లో కలిగించే నొప్పిలో కొత్త మనిషిని పుట్టిస్తుంది.
అది పునర్జన్మ.