<KG/>
అలల దారి

అలల దారి

సూర్యుడు క్రమంగా తన పసుపు కాంతిని తుడిచేస్తూ, ఆకాశానికి నారింజ రంగు పులుముతు వెనుదిరుగుతున్నాడు.

ఆ గోధూళి వేళ, మైలవరం డ్యాం గోడ మీద అతను కూర్చుని ఉన్నాడు. వయసు అరవై–అరవై అయిదు సంవత్సరాలు ఉండవచ్చు. తైలసంస్కారం లేక జుట్టు పొడిబారి ఉంది, మాసిపోయిన గడ్డం, నీలి గళ్ల లుంగీ, నిలువు గీతల చొక్కా వేసుకొని ఉన్నాడు. తలకి పసుపు పచ్చ రంగు ఉన్న టవల్ తలపాగా లాగా కట్టుకొని ఉన్నాడు. అతని చూపు ఏటవాలుగా ఉన్న డ్యామ్ గోడ మీద గడ్డి మేస్తున్న తన మేకల మంద మీద ఉంది.

అతని చూపులో ఏ భావమూ లేదు నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.అతను దేని గురించి ఆలోచించడం లేదు.

కొద్దిసేపటి క్రితం పడిన జల్లు ఆగిపోయింది. డ్యాంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. చుట్టూ ఉన్న కొండల నుండి వచ్చే గాలి హోరు, అలల చప్పుడు, మధ్యమధ్యలో మేకల అరుపులు ఇక్కడ ఏదో జరుగబోతోంది అన్నట్టుగా సంగీతంలా వినిపిస్తున్నాయి.

అతను కూర్చున్న ప్రదేశానికి నుండి ఎడమ వైపుగా, ఒక మధ్య వయస్కురాలు నడుస్తూ వస్తుంది. వయసు యాభై నుంచి యాభై ఐదు మధ్య ఉండవచ్చు. ఆమె వేసుకున్న వస్త్రధారణను బట్టి చూస్తే కలిగి ఉన్న కుటుంబం నుండి ఉంటుంది అని ఎవరైనా చెప్పొచ్చు. ఆమె అతన్ని చూడలేదు. డ్యాం గేటు పైన ఉన్నగోడపైకి ఎక్కింది. కళ్లలోంచి నీరు ధారగా కారుతూనే ఉంది. గాలికి ఆమె జుట్టు, చీర కొంగు రెపపలాడుతుంది .

ఎవరో తనను గమనిస్తున్నారని ఆమెకు అనిపించింది. ఒక్కసారిగా తల తిప్పి అతని వైపు చూసింది. అతను అలా, నిశ్చలంగా చూస్తూనే ఉన్నాడు. కానీ అతని చూపులో ఎలాంటి భావమూ లేదు.

ఆమె వెంటనే తలను తిప్పి , డ్యాం నీళ్ల వైపు చూసింది. బాధ ఆమెను కమ్మేసింది. కాళ్లు వణికుతున్నాయి. గాలిని గట్టిగా పీల్చుకుంది, ఒక్కసారిగా లోపలున్న శక్తిని కూడతీసుకోవడానికి అన్నట్టు ,మోచేతులని, మోకాళ్ళన్నీ వంచి.. సిద్ధం అయింది.. ఒక క్షణిక కాలం పాటి ఆగి.. వెనక్కి తిరిగి గోడపై నుండి దిగింది. కళ్లను తుడుచుకుంటూ, అతని దగ్గరికి వెళ్లి, అతను కూర్చున్న దిశకు వ్యతిరేకంగా కూర్చుంది. కొన్ని క్షణాల తర్వాత నిశ్శబ్దంగా అడిగింది

“నన్ను… ఎందుకు ఆపలేదు?”

అతను వెంటనే సమాధానం ఇవ్వలేదు.

అతని చూపు మళ్లీ తన మేకల మందవైపు తిరిగిపోయింది. తలచుట్టూ కట్టుకున్న తలపాగా నుంచి బీడీ కట్టను బయటకి తీశాడు. అందులోంచి ఒక బీడీ తీసుకుని వెలిగించబోయాడు. కానీ కాసేపటి క్రితం కురిసిన జల్లుల వల్ల తడిసినట్టుంది ,అది వెలుగలేదు. ఆరబెట్టుదాం అనే ఉద్దేశంతో దానిని కింద పెట్టాడు. మరో బీడీ తీసుకున్నాడు. ఈసారి మంట అంటుకుంది. రెండు మూడు సార్లు బలంగా పీల్చి, పొగను ఆకాశం వైపుగా గాల్లోకి వదిలాడు .

పక్కనే ఉన్న రెండు గులకరాళ్లను చేతుల్లోకి తీసుకొని, వాటిని ఆడిస్తూ ఆమె వైపుకి చూడకుండానే ఇలా అన్నాడు

"సచ్చిపోనికి బతకాలన్నంత దైన్యం వుండాలా "

ఎలాంటి భావాన్ని చూపించకుండా తేలికగా అన్నాడు.

ఆమె ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఇలాంటి సమాధానం వస్తుందని ఆమె ఊహించలేదు. అతను క్రూరంగా ప్రవర్తించడం లేదని ఆమె గ్రహించింది.ఆ మాటలు ఆమె మనసులో ఏదో విచిత్రమైన భావాన్ని రేపాయి.

కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, ఆమె చెప్పడం మొదలెట్టింది—

“నేను ఎటువంటి కష్టంలో …”

కానీ ఆమె మాట పూర్తి కాక ముందే ఆపమన్నట్టు , అతను తన చెయ్యిని చూపించాడు.

ఆ తర్వాత బీడీని మళ్లీ పీల్చి, పొగను గాలిలోకి వదిలాడు.

రెండు క్షణాల తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలెట్టాడు— "ఈ భూమ్మీదా ఉండే పతి జీవికి, జీవానికి, కట్టం ఉంది.. నెలల కాడ బిడ్డ ఆకలి అని సెప్పల్యక ఏడుచ్యడే అదొక కట్టం, యండకి నీడనిచ్యే ఈ చెట్లకి ఆకులన్నీ రాల్తాయనే కట్టం, భూమి లోపల బడ్డ ఇత్తనం బూమిని సీలుసుకు రావడం కట్టం, సీకట్లో ఏలుతురు లేకపోతే కట్టం,కడుపునింపుకొనికి యన్నన్నో కస్టపడి పోతల్లే ఈ జీవాలు.”

అందరికి అయ్యే కట్టాలు ఒకరికి పెద్దగా గనపడ్తాయి ,ఇంగోనికి చిన్నగా.

ఇది కట్టం అని ఆలోసిస్తే అది కట్టం, మానెచ్యే కట్టం ల్యా.

అబద్దం కానీ సత్తెం ఇది.

ఆమె అతను చెప్పిన మాటలను శ్రద్ధగా వింటోంది. కానీ అతను మాత్రం ఒక్కసారికీ కూడా ఆమెను చూడలేదు.

కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు.

"డ్యామ్ లో ఉన్న నీళ్ళని సూడు, యాడికడికో పోవాలని యాంనుంచో వచ్చి ఈడీకి వచ్చి పన్నై. ఇన్నుంచి యాకాటికి పోవని దాన్లకి కూడా తెలుసు, ఐన సూసినావా గోడలకి ఎట్ట ఢీ కొడతాండాయో, ఎపుడొకసారి దేవుడు పక్కన నిలబడతాడు, వాన ఎక్కువ పడ్తది గేట్లు ఇడుచారు అపుడు మల్ల కొత్త దారి ఎతుకుంటాయి.

ఈ పక్కకి సూడు , ఆ జీవాలకు రేపు అనేటిది ఉంటాడో లేదో తెలీదు, ఎమన్నా ఆలోచిస్తాండాయ అయి. మాటలే రాని ఆయె బతుకుతాండాయి, మనకేం ఖర్మ.

సదువొచ్చినోడు ఒకడు శ్మశానం కాడ నిలబడి ఇలా అన్నాడంట "ఎపుడు సచ్చినా లాస్టుకి ఈడకే రావాలా, తొందరపడి అడ్డదారి తీస్కొని రాకు " అని

ఇంతలో ఒక మేక ఏటవాలు గోడ మీద నుండి జారీ కిందకి పడింది . అది చూసి ఆమె భయంతో గట్టిగ అరిచి, అతని వైపు చూసింది..

అతను నిశ్చలంగా ఎటు కదలకుండా అలానే ఉన్నాడు.

జారిపడిన మేక మళ్ళీ గోడ ఎక్కడం మొదలుపెట్టింది.

అతను ఇంకొక బీడిని ముట్టించి పొగను గాలిలోకి వదిలాడు . మాటలు ఆగిపోయాయి.

అప్పుడే డ్యాం నీళ్లలో ఒక్కసారిగా పెద్ద అల ఉవ్వెత్తున ఎగసి గోడకు ఢీకొని, చిన్న చిన్న అలలుగా చెల్లాచెదురై మళ్లీ నీళ్లలో కలిసిపోయింది.

ఆమె ఆ దృశ్యాన్ని గమనించింది.

గోడకు ఢీకొన్న నీరు ఆగిపోలేదు—కొత్త కొత్త అలలుగా మారి ముందుకు పరిగెత్తింది.

అతను మాత్రం ఆమె వైపు చూడలేదు. .

కానీ ఆ అలల శబ్దం, ఆ కదలిక… ఆమెలో ఏదో మెల్లగా కదిలించింది.

ఆమె ముఖంపై ఆ కన్నీటి రేఖలు ఇంకా ఉన్నా, కళ్లలో ఎక్కడో ఒక మూలలో ఒక ప్రశ్న కన్నా, ఒక ఆలోచన మొదలై లేచి నిలబడింది. దూరంగా ఒక మేక పురిటినొప్పులతో బాధపడి, బుజ్జిమేకని ప్రసవించింది.

అతని ముఖం లో చిన్నపాటి నవ్వు, ఆమె వైపు చూసి బుజ్జిమేక దగ్గరకి నడుచుకుంటూ వెళ్ళాడు.